పంజాబ్ లోని అమృత్‌సర్, మట్టేవాల్ గ్రామంలో కన్నతండ్రి కూతురును చంపి అనంతరం ఇంట్లోనే మృతదేహాన్ని పాతిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో హర్ధాల్ సింగ్, సరబ్జీత్ కౌర్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నవదీప్ కౌర్(19) అనే కూతురు ఉంది. గత సోమవారం ఇంట్లోనే హర్ధాల్ సింగ్ గుంత తీస్తుండగా, డాడీ ఎందుకు గుంత తీస్తున్నాడని తల్లితో ఫోన్‌లో కూతురు మాట్లాడింది. ఆ సమయంలో సరబ్జీత్ కౌర్ తన పుట్టింట్లో ఉంది. కొంచెం సమయం తరువాత తల్లి మళ్లీ కూతురు ఫోన్ చేసింది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు ఫోన్ చేసి అడిగింది. అతడి సమాధానం సరిగా లేకపోవడంతో వెంటనే ఇంటికి వచ్చింది. అప్పటికే భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లో గుంత తీసిన అనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు గ్రామానికి చేరుకొని గుంతను తవ్వి చూడగా నవదీప్ మృతదేహం కనిపించింది. వెంటనే మృతురాలి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో దంపతుల పెద్ద కూతురు ఓ యువకుడితో పారిపోయినట్టు సమాచారం. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. నవదీప్ కూడా ఓ యువకుడి ప్రేమలో ఉన్నట్టు అనుమానం కలగడంతోనే తండ్రి ఆమెను చంపి ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
0 Comments