Ad Code

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ఎంపీలతో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రక్షణ రంగ అభివృద్ధి, నూతన విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026'కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం ఆహ్వానించారు. ఈ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయనున్న 'డిఫెన్స్ ఎక్స్‌పో-2026'ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్, స్పేస్ రంగాల సదస్సులు, పరిశ్రమల ఎగ్జిబిషన్, భూ రక్షణ వ్యవస్థల లైవ్ డెమోలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయాలని, భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలతో పాటు ఆధునిక యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలని కోరారు. అలాగే హెచ్ఏఎల్, డీఆర్‌డీవో, బీడీఎల్, బీఈఎల్ వంటి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు తమ స్వదేశీ సాంకేతికతను ఇక్కడ ప్రదర్శించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్‌డీఎల్ ప్రాజెక్టు కోసం టీజీఐఐసీ ద్వారా 416.18 ఎకరాల భూమిని ఏడాదికి కేవలం రూ.1 నామమాత్రపు లీజుతో 33 ఏళ్ల కాలానికి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రికి సీఎం వివరించారు. మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఇప్పటికే 750 ఎకరాలు సేకరించామని, రక్షణ శాఖ కోరిన మేరకు మరో 750 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన అనుసంధానతను పెంచే అంశంపై చర్చించారు. ఆదిలాబాద్, వరంగల్ (మామూనూరు) విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, రాష్ట్రంలో ప్రతిపాదిత ఇతర నూతన ఎయిర్‌పోర్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి విమాన సర్వీసులు ప్రారంభమయ్యేలా సహకరించాలని కోరారు.

Post a Comment

0 Comments

Close Menu