Ad Code

10 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్ : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌ల సీజ్

సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో  అర్హత లేకపోయినా డాక్టర్ల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్‌సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. కేవలం టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు సైతం వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్  ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు, గ్లూకోజ్ టెస్టింగ్ మిషన్లు, సిరంజీలతో పాటు భారీగా గడువు ముగిసిన ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి మాట్లాడుతూ నకిలీ డాక్టర్ల వల్ల రోగుల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చికిత్స కోసం వెళ్లే ముందు సదరు వైద్యులకు సరైన మెడికల్ సర్టిఫికేషన్లు, అర్హతలు ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అర్హత లేని వ్యక్తులు క్లినిక్‌లు నడుపుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు గానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Close Menu