బెంగళూరు నగర పరిధిలోని త్రీ-స్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సడన్ సర్ప్రైజ్ రైడ్స్ నిర్వహించింది. ఏకంగా 30 బృందాలుగా ఏర్పడిన అధికారులు శుక్రవారం ఒక్కరోజే నగర వ్యాప్తంగా ఉన్న 26 ప్రముఖ హోటళ్ల వంటశాలలను, స్టోర్ రూమ్‌లను జల్లెడ పట్టారు. కిచెన్లలోకి వెళ్లి చూస్తే కనీస శుభ్రత లేకపోవడమే కాకుండా, ఎప్పుడో కాలం చెల్లిన డెయిరీ ఉత్పత్తులు, పాడైపోయిన నాన్‌వెజ్ నిల్వలను వినియోగిస్తున్నట్లు తేలింది. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు అధికారులను సైతం షాక్‌కు గురిచేశాయి. ఫ్రిజ్‌లలో ఉంచిన కూరగాయలకు బూజు పట్టడం, ఎప్పుడో ఎక్స్‌పైరీ అయిపోయిన పాలు, బేకరీ ఉత్పత్తులతోనే పదార్థాలు తయారు చేస్తున్నట్లు దొరికిపోయింది. ఇక కొన్ని హోటళ్లలో శాకాహార, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా ఉంచకుండా ఒకే చోట కోల్డ్ స్టోరేజ్ చేయడం గమనార్హం. అధికారులు ప్రశ్నించడంతో తప్పు ఒప్పుకున్న కొందరు కిచెన్ స్టాఫ్ క్షమాపణలు చెబుతూ బేకరీ ఐటమ్స్‌ను చెత్తబుట్టలో పారబోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనిఖీల్లో భాగంగా అధికారులు భారీగా కుళ్ళిపోయిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని అక్కడిక్కడే ధ్వంసం చేశారు. హోటళ్ల నుంచి చికెన్, మటన్, చేపలు, పాలు, నెయ్యి, కారం, పసుపు, సాస్, కాజూతో సహా మొత్తం 35 రకాల శాంపిళ్లను అధికారులు సేకరించి ల్యాబోరేటరీకి పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రసిద్ధ హోటళ్లన్నింటికీ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ నివేదికలు రాగానే చట్టప్రకారం సదరు యాజమాన్యాలపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత శాఖ స్పష్టం చేసింది.
0 Comments