Ad Code

లాల్ దర్వాజా బోనాలు : మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పణ

హైదరాబాద్, లాల్ దర్వాజా బోనాల పండుగ అంబరాన్నంటింది. ప్రకృతిని, మాతృమూర్తిని దైవంగా భావించి పూజించే అత్యంత ప్రాచీనమైన ఈ ఘన సంప్రదాయం, భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కష్టాలను తీర్చే గ్రామదేవతగా, విష జ్వరాలు, రోగాల నుంచి రక్షించే చల్లని తల్లిగా పూజలందుకుంటున్న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తజనసందోహంతో కిటకిటలాడింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మహంకాళి క్షేత్రం, ఘటాల ఊరేగింపులు, డప్పుచప్పుళ్లతో పాతబస్తీ వీధులన్నీ పులకించిపోయాయి. ఉదయం నుంచే వేలాదిమంది మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో తలపై వేపమండలతో అలంకరించిన బోనాల కుండలను ఎత్తుకుని కాళికాదేవికి నైవేద్యం అర్పించారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించగా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఒడిబియ్యం, చీర-సారెలతో అమ్మవారిని ఆరాధించారు. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి శాంతి కళ్యాణోత్సవం కంటికి ఇంపుగా సాగింది.

Post a Comment

0 Comments

Close Menu