Ad Code

మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదు !

మిళనాడు అసెంబ్లీలో కావేరి జల వివాదం, కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ఆనకట్ట అంశంపై మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా, ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్‌ తేల్చేశారు. అలాగే కావేరి వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌కు 'చీప్‌ పాలిటిక్స్‌' అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు విజయ్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేకెదాటు అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. "మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలుచేయాలని నేను అనుకోవడం లేదు. కావేరి జలాల విషయంలో మా వైఖరిని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశాం. నది జలాల హక్కులు, మేకెదాటు అంశంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు" అని విజయ్‌ అన్నారు. అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదని, కావేరి జలాల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని, ఎలాంటి రాజీకి వెళ్లబోమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. గతంలో ఎవరు ఏం చేశారన్న విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాము భావించడం లేదని సీఎం చెప్పారు. "ఎవరు క్రెడిట్‌ తీసుకుంటారు? ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే దానిపై మాకు ఆసక్తి లేదు. కావేరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఈ అంశాన్ని న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్తాం" అని ఆయన స్పష్టం చేశారు.  మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడుతూ.. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. "అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాసినందుకు ప్రస్తుత సీఎం విమర్శించారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన విషయం" అని ఉదయనిధి అన్నారు. కావేరి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కురువై (కావేరి డెల్టాలో వేసే ప్రత్యేక వరి సాగు) పంట సేకరణకు, కరువు నష్టపరిహారానికి మధ్య తేడా కూడా తెలియదా? కేవలం పేపర్లు చదివితే సరిపోదు.. రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి అంటూ సీఎం విజయ్‌కు చురకలు అంటించారు. అయితే.. దీనికి ఆ తర్వాత మాట్లాడిన విజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేవలం ఒక విషయం గురించి మాట్లాడటం కాదు.. మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి. ముందు వెనకా మొత్తం పేపర్లు చదివి ఉంటే అసలు పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది అంటూ ఆయన బదులిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu