Ad Code

భారీగా గంజాయి స్వాధీనం : ఇద్దరు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి లభ్యమైంది. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు వాహన సోదాలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును నిలిపి తనిఖీ చేశారు. అందులో మూడు పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసిన 25.970 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో సుమారు రూ. 4.29 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన దులపల్లి సుజీవ్ కుమార్, మొదుగు నరేష్‌లను పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయితో పాటు ఒక కారు, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి విజయవాడకు చెందిన చినంశెట్టి రాజేష్ అనే వ్యక్తికి చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గంజాయిని సరఫరా చేసిన సీలేరుకు చెందిన చింటూతో పాటు గంజాయి కొనుగోలుదారు రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఘటనపై రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu