యుద్ధం కారణంగా క్షీణించిన తన ఆయుధ నిల్వలను పెంచుకోడానికి ఇరాన్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రహస్య మార్గంలో రష్యా నుంచి ఇరాన్‌కు పేలుడు పదార్థాలు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి సరఫరా అవుతున్నట్టు ఓ అంతర్జాతీయ పత్రిక నివేదించింది. కాస్పియన్ సముద్రం మార్గం ద్వారా ఇవి ఇరాన్‌కు చేరుతున్నట్టు ఐరోపా ప్రభుత్వ నివేదికను ఉటంకించింది. ఈ విషయాన్ని ఓ పాశ్చత్య అధికారి సైతం ధ్రువీకరించారు. ఉపగ్రహ ఫోటోలను విశ్లేషించిన నిపుణుల ప్రకారం టెహ్రాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణుల తయారీకి ఉపయోగించే కీలక విడిభాగాలను కూడా మాస్కో పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రష్యా-ఇరాన్ సైనిక సంబంధాలలో ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యాకు గతంలో ఇరాన్ 'షాహీద్' రకం డ్రోన్లను భారీగా సరఫరా చేసింది. ఇప్పుడేమో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి రష్యా సహాయం చేస్తుండటం గమనార్హం. కాస్పియన్ సముద్రానికి రష్యా, ఇరాన్, కజికిస్థాన్, తుర్కెమినిస్థాన్, అజర్‌బైజాన్‌లు మాత్రమే సరిహద్దులుగా ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఈ సముద్రం సంపూర్ణంగా ఈ ఐదు దేశాల అధికార పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పాశ్చాత్య నౌకాదళాలకు చట్టపరమైన ప్రవేశం లేదు. రష్యా, ఇరాన్ ఓడరేవుల మధ్య ప్రయాణించే సరుకును అడ్డుకునే హక్కు ఏ విదేశీ యుద్ధనౌకకూ లేదు. ఈ నౌకలు 'ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్' ట్రాన్స్‌పాండర్లను ఆఫ్ చేసినప్పటికీ ఎవరి దృష్టిలో పడవు. అమెరికా నిఘా కళ్లుగప్పి కీలక సముద్ర మార్గాన్ని దాటుకుని, ఈ సరఫరా సురక్షితంగా సాగుతోంది. ఈ ఆయుధ సామగ్రికి సరఫరాకు అత్యంత కీలకమైన కాస్పియన్ సముద్రంలోని ఇరాన్ ఓడరేవు 'బందర్ అంజాలి'పై ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడులు చేసి, మౌలిక సదుపాయాలను, నౌకాదళ ఆస్తులను దెబ్బతీసింది. ఇరాన్ పునరుద్ధరణ ఇటీవలి యుద్ధంలో తన వద్ద ఉన్న డ్రోన్లు, క్షిపణులను అత్యధికంగా ఇరాన్ ఉపయోగించడమే కాకుండా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తన కీలక సైనిక మౌలిక సదుపాయాలను కోల్పోయింది. ఇప్పుడు రష్యా అందిస్తున్న ఈ సామగ్రి ద్వారా ఇరాన్ తన ఆయుధ నిల్వలను తిరిగి సమకూర్చుకునే అవకాశం ఉంది. ఇరాన్ రక్షణ శాఖ కూడా తన బాలిస్టిక్ క్షిపణులలో వాడే స్వదేశీ విడిభాగాల స్థానంలో రష్యా, చైనాల నుంచి దిగుమతి చేసుకున్నవి అమర్చడం ప్రారంభించింది. ఇవి ప్రధానంగా 'ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్' కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ తన 'లుక్ ఈస్ట్' వ్యూహంలో భాగంగా రష్యా, చైనాలతో సైనిక సహకారాన్ని పెంచుకుంటోంది. శత్రువుల సైనిక స్థావరాలపై నిఘా, లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి ఇరాన్‌కు రష్యా ఉపగ్రహ సమాచారం అందిస్తోంది. చైనా సైతం 'బేడూ' నావిగేషన్, రాడార్, నిఘా వ్యవస్థలతో పాటు ఘన-ఇంధన క్షిపణి తయారీ సామగ్రిని అందిస్తూ పశ్చిమ దేశాల సాంకేతికతపై ఇరాన్ ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. ఇరాన్ తన క్షిపణి నిల్వలను తిరిగి ఎంత వేగంగా పెంచుకుంటోందో చూసి ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ఆశ్చర్యపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
0 Comments