Ad Code

మన సభ - జనసభ : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే ఆలోచనతోనే 'మన సభ - జన సభ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. తన ప్రతిపాదనను అందరూ గౌరవించి సహకరించడంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ అనేది కొంతమంది ప్రజాప్రతినిధులకు మాత్రమే పరిమితమైన ప్రదేశం కాదని, ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించే ప్రజల సభ అని స్పీకర్ స్పష్టం చేశారు. అలాంటి సభకు ప్రజలు ఎందుకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ అసెంబ్లీని సందర్శించి, అక్కడ జరిగే కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కాలేజీ విద్యార్థులను గ్యాలరీకి తీసుకువచ్చి సభా కార్యక్రమాలను చూపిస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీలో చర్చలు ఎలా జరుగుతాయి? ప్రజా సమస్యలను ఎమ్మెల్యేలు ఎలా ప్రస్తావిస్తారు? చట్టాలు ఎలా రూపొందుతాయి? సభను ఎలా నిర్వహిస్తారు? వంటి అంశాలపై యువతకు ప్రత్యక్ష అవగాహన కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. రాజకీయ వ్యవస్థపై చిన్న వయసు నుంచే పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. రాజకీయాలను కేవలం ఎన్నికలు, పదవులు, పార్టీల వరకే పరిమితం చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటి ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో మంచి నాయకత్వం అందించాలంటే ఇప్పటి నుంచే పిల్లలకు ప్రజాస్వామ్య విలువలు, శాసన వ్యవస్థ, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో రాజకీయాలపై ఆసక్తి పెరగాలని, ప్రజా జీవితంలోకి రావాలనే ఆలోచన వారికి కలగాలని ఆకాంక్షించారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన యువత రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగానే పాఠశాల విద్యార్థులతో ప్రత్యేకంగా బాలల అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎమ్మెల్యేలుగా పాత్రలు పోషిస్తూ సభలో మాట్లాడారని చెప్పారు. ప్రజా సమస్యలు, సమాజానికి సంబంధించిన అంశాలపై విద్యార్థులు ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలిపారు. అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేలు సైతం మాట్లాడే విధంగా ఈ చిన్నారులు సభలో తమ వాణిని వినిపించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల ప్రతిభ, ధైర్యం, సభను అర్థం చేసుకున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. అసెంబ్లీ ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే 'మన సభ.. జన సభ' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన శాసనసభ కార్యకలాపాలను ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏర్పడిన సభ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.

Post a Comment

0 Comments

Close Menu