విశాఖపట్నం లోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్‌లో ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎగసిపడిన భారీ కెరటం ఒక యువతి, యువకుడిని సముద్రంలోకి లాక్కెళ్లింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నలుగురు యువతులు, ఓ ఆటో డ్రైవర్ సహా ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం 8 గంటలకు పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్ వద్దకు వెళ్లారు. తీరం పక్కన రాయిమీద నిల్చుని స్నేహితులు సరదాగా ఫొటోలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఒకరు పక్కన ఉండి ఫొటోలు తీస్తుండగా ఓ రాకాసి అల వారి మీదకు దూసుకొచ్చింది. నలుగురు అక్కడే రాయిమీద పడిపోగా, ఓ యువతి, యువకుడ్ని మాత్రం రాకాసి అల సముద్రంలోకి లాక్కెళ్లింది. సముద్రపు ఉధృతికి ఇద్దరూ క్షణాల్లోనే నీటిలో గల్లంతయ్యారు. తీరంలో ఉన్న మిగిలిన స్నేహితులు, స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటివరకూ స్నేహితులతో సరదాగా గడుపుతూ పండగ వాతావరణంలా ఉన్న చోట ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. గల్లంతైన వారిని పెద జాలారిపేట చెందిన నీతూ, పెందుర్తికి చెందిన ఆటోడ్రైవర్ దామోదర్ అని పోలీసులు గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే న్యూ పోర్ట్ పోలీసులు, మెరైన్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన యువతీ యువకుల కోసం గజ ఈతగాళ్ల సహాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
0 Comments