విశాఖ యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశారనే ఆరోపణలతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే బాధితురాలు ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదం తనకు, రాహుల్ రెడ్డికి మధ్య జరిగిన వ్యక్తిగత వ్యవహారమని, ఈ వివాదంతో రాహుల్ సిప్లిగంజ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. తాము ఇద్దరం ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలో ఉన్నామని, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. రాహుల్ రెడ్డికి బంధువు కావడంతో రాహుల్ సిప్లిగంజ్ పేరు ఈ వ్యవహారంలోకి వచ్చిందని బాధితురాలు వెల్లడించారు. అయితే ఆయన తనను బెదిరించలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తనపై కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. తనతో కొన్ని వీడియోలు బలవంతంగా చేయించారని, ప్రస్తుతం వాటినే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. తనను హనీట్రాప్ కేసులో ఇరికిస్తామని, తనకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలు సృష్టిస్తామని కొంతమంది బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించి మానసికంగా ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసుల పేర్లను ఉపయోగించుకుంటూ తన కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా తమ ఇద్దరి మధ్య అసలు జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చిత్రీకరించారని బాధితురాలు పేర్కొన్నారు. కొన్ని వీడియోలు, ఆడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను చేయని పనులను తనకు ఆపాదించి చెడ్డ వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాహుల్ రెడ్డి, తన మధ్య ఉన్న వివాదానికి సంబంధించి కీలక విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. తమ మధ్య ఉన్న సమస్యను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నామని తెలిపారు. కోర్టులో దాఖలు చేసిన కేసును కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ తాజా వ్యాఖ్యలతో ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చిన పలు అంశాలపై క్లారిటీ వచ్చినట్లయింది. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారనే ప్రచారాన్ని బాధితురాలు ఖండించినట్లు తెలుస్తోంది. అసలు వివాదం తనకు, రాహుల్ రెడ్డికి మధ్య జరిగిన వ్యక్తిగత వ్యవహారమేనని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
0 Comments