Ad Code

పాఠశాల ప్రిన్సిపాల్ దారుణ హత్య

తెలంగాణ లోని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నిత్యం విద్యార్థుల మధ్య ఉంటూ పాఠశాల బాధ్యతలు నిర్వర్తించే ఓ ప్రిన్సిపల్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె శరీరంపై ఏకంగా 27 కత్తిపోట్లు ఉన్నట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో కల్లు రూపారెడ్డి (48) తన భర్త రాజేందర్‌రెడ్డితో కలిసి నివాసముంటున్నారు. స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆమె ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి హైదరాబాద్‌లోనూ సొంతిల్లు ఉంది. కుమారుడు అభినవ్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు తరచూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. గత శనివారం నుంచి వరుసగా మూడు రోజుల సెలవులు ఉండటంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. అయితే భర్తకు అక్కడ పని ఉండటంతో ఆమె మంగళవారం ఉదయం ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చి పాఠశాలకు వెళ్లారు. రూపారెడ్డి సాధారణంగా సాయంత్రం 6.30 గంటల వరకు పాఠశాలలోనే ఉండేవారని తెలుస్తోంది. అయితే మంగళవారం సాయంత్రం 5.25 గంటల సమయంలో తమ ఇంటికి స్నేహితులు వస్తున్నారని చెప్పి పాఠశాల నుంచి సమీపంలోని ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె తిరిగి పాఠశాలకు వెళ్లలేదు. బుధవారం ఉదయం భర్త రాజేందర్‌రెడ్డి భార్యకు ఫోన్‌ చేయగా మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్‌ చేసి ఇంట్లోకి వెళ్లి చూడాలని కోరారు. వారు ఇంటి వద్దకు వెళ్లి ఎంత పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. విషయాన్ని వెంటనే రాజేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి తెలిపారు.దీంతో ఆందోళనకు గురైన రాజేందర్‌రెడ్డి.. ఇంటి పక్కనే నివసిస్తున్న చింతపల్లి ఎస్సై రాంమూర్తికి ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. ఎస్సై రాంమూర్తి స్థానికులతో కలిసి ఇంటికి వెళ్లి పరిశీలించగా.. రూపారెడ్డి రక్తపు మడుగులో పడి కనిపించారు. వెంటనే విషయాన్ని ఆమె భర్తకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూపారెడ్డి శరీరంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ దారుణ హత్య వెనుక కారణాలు ఏమిటన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఘటనా స్థలాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నవీన్‌కుమార్‌, ఎస్సై రమేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రూపారెడ్డిని ఎవరు హత్య చేశారు? ఇంట్లోకి నిందితులు ఎలా ప్రవేశించారు? హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు అభినవ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu