వందేమాతరం గేయంపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. పార్టీ కార్యక్రమాలలో జాతీయ గీతానికి సంబంధించి తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ 'కొత్త ముస్లిం లీగ్'లా మారుతోందని ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. వందేమాతరాన్ని పాక్షికంగా ఆలపించడం అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ పదేపదే దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ సమర్థన కాదని, ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం తీసుకున్న నిర్ణయం, 1937 నాటి పార్టీ తీర్మానానికి అనుగుణంగానే ఉందని కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నప్పటికీ, దీనిపై రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కార్యక్రమాలలో జాతీయ గీతం యొక్క మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో జాతీయ గీతానికి సంబంధించి తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునరుద్ఘాటించింది. 1937 నాటి పార్టీ తీర్మానానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం సమగ్ర ఆలాపన కోసం నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి అగ్రనేతల హయాంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. అయితే, పూర్తి స్థాయి గీతాన్ని ఆలపించకపోవడంపై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
0 Comments