Ad Code

లక్షా యాభై వేల మందికి ప్రాథమిక AI, క్లౌడ్ నైపుణ్యాలపై ఉచిత శిక్షణ

కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కలిసి దేశవ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా లక్షా యాభై వేల మందికి ప్రాథమిక AI, క్లౌడ్ నైపుణ్యాలపై ఉచిత శిక్షణ అందించనున్నారు. అదనంగా, ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంపికైన పది వేల మందికి AWS re/Start ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యేకమైన ఇంటెన్సివ్ శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తిచేసిన వారికి పరిశ్రమలో గుర్తింపు పొందిన ధ్రువపత్రాలతో పాటు అర్హతకు అనుగుణంగా ఉద్యోగ ఇంటర్వ్యూ అవకాశాలను కూడా కల్పించనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, AI వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే చిన్న నగరాలు, పట్టణాల్లోని యువతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టెక్నాలజీ శిక్షణ, పరిశ్రమ సంస్థలతో సంబంధాలు, అవసరమైన సర్టిఫికేషన్లు అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడమే కొత్త కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్డీసీ ఎంపిక చేసిన డెలివరీ భాగస్వామి కల్టస్ ఎడ్యుకేషన్ ద్వారా వంద శాతం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ శిక్షణను విస్తరించనున్నారు. దీంతో యువత శిక్షణ కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ సొంత ప్రాంతాల నుంచే నేర్చుకునే అవకాశం ఉంటుంది. అభ్యాసకులు ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా కార్యక్రమంలో చేరి AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్‌తో తమ శిక్షణను ప్రారంభించవచ్చు. ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్, AIకి సంబంధించిన ప్రాథమిక అంశాలను తమకు అనుకూలమైన వేగంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమిక శిక్షణలో మంచి సామర్థ్యం చూపిన అభ్యాసకులు తదుపరి దశలో AWS re/Start ప్రోగ్రామ్‌కు వెళ్లవచ్చు. AWS re/Startలో క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI ప్రాథమిక అంశాలు వంటి కీలక విభాగాల్లో క్రమబద్ధమైన శిక్షణ అందిస్తారు. ఇన్‌స్ట్రక్టర్ ఆధారిత క్లాసులు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, వాస్తవ ప్రపంచ ఉద్యోగ పరిస్థితుల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులు, మెంటరింగ్ ద్వారా అభ్యాసకులు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత అర్హత కలిగిన అభ్యాసకులకు AWS సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ద్వారా అభ్యర్థుల క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలను పరిశ్రమ స్థాయిలో ధ్రువీకరించుకోవచ్చు. అంతేకాకుండా స్థానిక సంస్థలతో ఉన్న భాగస్వామ్యాల ద్వారా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ ఇంటర్వ్యూలకు అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన అంశం జాతీయ స్థాయి హ్యాకథాన్. శిక్షణ చివర్లో నిర్వహించే ఈ హ్యాకథాన్‌లో పాల్గొనేవారు తాము అభివృద్ధి చేసిన AI, క్లౌడ్ ఆధారిత పరిష్కారాలను పరిశ్రమ నాయకులు, నియామక అధికారులు, ఇతర కీలక భాగస్వాముల ముందు ప్రదర్శించవచ్చు. తద్వారా కేవలం సర్టిఫికేషన్ పొందడమే కాకుండా తమ ప్రతిభను నేరుగా పరిశ్రమకు చూపించే అవకాశం లభిస్తుంది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి, విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం 'విక్షిత్ భారత్ 2047' లక్ష్యాలకు అనుగుణంగా ఉందని అన్నారు. యువతకు అవకాశాలు వారు నివసించే ప్రాంతం లేదా సామాజిక నేపథ్యంపై ఆధారపడకుండా అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని యువత భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందడం దేశానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. AWS స్కిల్లింగ్ అండ్ సోషల్ ఇంపాక్ట్ విభాగం APJC లీడ్ రాణి బర్చ్‌మోర్ మాట్లాడుతూ, AWS re/Start ద్వారా కొత్త ప్రతిభను ఉద్యోగ మార్కెట్‌లోకి తీసుకురావచ్చని అన్నారు. ఇది అభ్యర్థులకు క్లౌడ్ రంగంలో కెరీర్ ప్రారంభించేందుకు, సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను పొందేందుకు, స్థానిక సమాజాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కల్టస్ ఎడ్యుకేషన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింగ్ మాట్లాడుతూ, నైపుణ్య శిక్షణకు అసలైన అర్థం అది ఉద్యోగ అవకాశాలు, ఆత్మవిశ్వాసం, గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌గా మారినప్పుడే ఉంటుందని అన్నారు. శిక్షణ నుంచి సర్టిఫికేషన్, అక్కడి నుంచి ఉద్యోగ అవకాశాల వరకు పూర్తి ప్రయాణాన్ని అభ్యాసకులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu