చైనా హైస్పీడ్ రవాణా సాంకేతికతలో మరో సంచలనం సృష్టించింది. హుబే ప్రావిన్స్‌లోని డోంగ్‌హు ల్యాబొరేటరీలో నిర్వహించిన ప్రయోగంలో 1.1 టన్నుల బరువున్న ప్రయోగాత్మక మ్యాగ్లెవ్ వాహనం కేవలం 5.3 సెకన్లలో గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అనంతరం సుమారు 200 మీటర్లలో నియంత్రిత పద్ధతిలో వాహనాన్ని నిలిపివేశారు. ఈ ప్రయోగాన్ని ఒక కిలోమీటరు పొడవైన ప్రత్యేక ట్రాక్‌పై నిర్వహించారు. వాహనం నిలిచిన చోటు నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్లి కేవలం 5.3 సెకన్లలో 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత అత్యాధునిక బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగించి సుమారు 200 మీటర్లలో సురక్షితంగా ఆపారు. ఇంతటి వేగాన్ని సాధించడంతో పాటు దాన్ని ముందుగా నిర్ణయించిన ఎంపిక ప్రదేశంలో ఖచ్చితత్వంతో నిలిపివేయడం కూడా ఈ పరీక్షలో కీలక అంశంగా నిలిచింది. 800 కిమీ వేగం సాధించినప్పటికీ ఇది ప్రయాణికులు ప్రయాణించే సాధారణ బుల్లెట్ ట్రైన్ కాదు. ఇది అత్యంత వేగవంతమైన రవాణా, ఏరోస్పేస్, రాకెట్ వంటి రంగాలకు ఉపయోగపడే సాంకేతికతలను పరీక్షించేందుకు రూపొందించిన ప్రయోగాత్మక వాహనం. ఇందులో ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ప్రస్తుతం రూపొందించలేదు. అయితే, అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైలు కోసం.. పొడవైన, అత్యంత కచ్చితత్వంతో నిర్మించిన ట్రాక్‌లు, భారీ మౌలిక వసతులు, భద్రత, బ్రేకింగ్, స్థిరత్వం వంటి అనేక సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. మ్యాగ్లెవ్ టెక్నాలజీలో అయస్కాంత శక్తిని ఉపయోగించి వాహనాన్ని ట్రాక్‌పై కొద్దిగా పైకి లేపుతారు. దీంతో సాధారణ రైళ్లలో ఉండే చక్రాలు, పట్టాల మధ్య ఘర్షణ చాలా వరకు తగ్గుతుంది. ట్రాక్‌లోని విద్యుదయస్కాంత కాయిల్స్ సృష్టించే అయస్కాంత క్షేత్రాలు వాహనాన్ని ముందుకు నడిపిస్తాయి. డోంగ్‌హు ల్యాబొరేటరీలో ఇదే ప్రయోగాత్మక వాహనం గతంలోనూ వేగ రికార్డులు నమోదు చేసింది. 2025 జూన్‌లో సుమారు 650 కిలో మీటర్లు వేగాన్ని 7 సెకన్లలో అందుకుంది. ఆ తర్వాత 700 కిలో మీటర్లు, 798 కిలోమీటర్లు వేగాలను కూడా సాధించింది. తాజాగా 800 కిలో మీటర్ల వేగాన్ని 5.3 సెకన్లలో చేరుకోవడంతో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది.
0 Comments