Ad Code

ఫెర్రీలో మంటలు : ఐదుగురు మృతి, 41 మంది గల్లంతు

ఇండోనేషియాలోని మదురా ద్వీపంలో ఓ ఫెర్రీకి మంటలు అంటుకుని, కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 41 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయానికి ఫెర్రిలో 270 మందికిపైగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు జావా ప్రావిన్సులు సురబయలోని తంజుంగ్ పెరాక్ రేవు నుంచి దక్షిణ సులవేసిలోని మకాసర్‌కు ఫెర్రీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం పోర్టు నుంంచి ఫెర్రీ ప్రయాణం మొదలైన కొన్ని గంటల తర్వాత మంటలు చెలరేగినట్లు కెప్టెన్ సమాచారం అందించారని, కొద్దిసేపటికే దానితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటి వరకు మొత్తం 225 మంది రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రయాణికులు ఫెర్రీ ముందు భాగానికి వచ్చి.. సాయం కోసం హాహాకారాలు చేస్తున్నారు. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు నౌకకు ఒక వైపున గుమిగూడి ఉండగా, కొందరు నౌక నుంచి నీటిలోకి దూకుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. సపుడి ద్వీపానికి ఉత్తరాన సుమారు 19 నాటికల్ మైళ్ల దూరంలో ఫెర్రీ ఉన్నట్లు సురబయ రెస్క్యూ ఆఫీసు తెలిపింది. ఆ నౌక దాదాపు పూర్తిగా మంటల్లో చిక్కుకుందని, ప్రయాణికులు ముందు భాగంలోకి వచ్చి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారని అధికారులు తెలిపారు. దానికి సమీపంలోని అనేక నౌకలు సహాయక చర్యలలో పాల్గొన్నాయి. సురబయ రెస్క్యూ ఆఫీస్ చీఫ్ నానాంగ్ సిగిత్ మాట్లాడుతూ.. ''మంటల్లో కేఎంపీ ముతియారాలోని ప్రయాణికులను తరలింపునకు TB హస్నూర్ 26, బ్రిటిష్ మెంటర్ సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు నౌకలు ఫెర్రీ వద్ద ఉన్నాయి'' అని తెలిపారు. అలాగే, SAR 249 పెర్మాడి అనే సహాయక నౌక సంఘటనా స్థలానికి బయలుదేరింది, కానీ అది అక్కడకు చేరుకోడానికి దాదాపు ఆరు గంటల సమయం పడుతుందని అంచనా.

Post a Comment

0 Comments

Close Menu