హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ రాయదుర్గం పరిధిలోని పాన్‌మక్తా ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 83/1 భూములకు వేలంలో ఊహించని రీతిలో రికార్డు ధర లభించింది. ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోవడం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మొత్తం 5.25 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ భూమిని ప్రత్యేకంగా వేలం వేయగా ఈ ధర పలికింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు ఇంత భారీ మొత్తం రావడం బహుశా ఇదే తొలిసారి. దీన్ని రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఆల్ టైమ్ రికార్డుగా నిపుణులు చెబుతున్నారు. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత విలువైన స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ఎంఎస్‌ఎన్ రియాల్టీస్' పోటీపడి దక్కించుకుంది. వేలంలో ఎకరా రూ.264 కోట్లు పలకడంతో.. ఈ 5.25 ఎకరాలకు గానూ ఆ సంస్థ సుమారు రూ.1,386 కోట్లు వెచ్చించనుంది. ఐటీ కారిడార్ విస్తరణ, మౌలిక వసతుల పెంపు వల్లే రాయదుర్గం భూములకు ఇంత అసాధారణ ధర లభించిందని భావిస్తున్నారు. ఇదే సర్వే నంబర్‌లో గత మే నెలలో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్లు పలికింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆ పాత రికార్డును బద్దలు కొడుతూ ఇప్పుడు ఏకంగా రూ.264 కోట్లకు చేరడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అద్భుతమైన కనెక్టివిటీ ఉండటంతో రాబోయే రోజుల్లో ఇక్కడ భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
0 Comments