పార్లమెంట్‌లో చర్చ నిర్వహించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలకు 24 గంటల సమయం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు తాను సభలోనే ఉంటానని, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. అమిత్ షా సవాల్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. "ఆయన ఏం మాట్లాడినా మాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అంటూ ఘాటుగా స్పందించారు. నీట్ విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం మోపడం, రామమందిర విరాళాల చోరీ వంటి అంశాలపై హోంమంత్రి ప్రకటన ఇవ్వాలని, చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు అధికారికంగా లేఖ రాసి ఇవ్వాలని, ఆ తర్వాత సభలో చర్చ జరిగేలా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. "మీరు లేఖ రాసి ఇవ్వండి. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆయన పేర్కొన్నారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని, చర్చ కావాలా లేక సభను అడ్డుకోవడం కొనసాగించాలా అనేది విపక్షాలే తేల్చుకోవాలని షా సవాల్ విసిరారు. తాను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా వస్తున్నానని, తన ఛాంబర్‌లోనే ఉంటానని అమిత్ షా తెలిపారు. అయితే ఉభయసభల్లోనూ విపక్షాలు సభను సజావుగా నడవనివ్వకుండా నిరంతరం అడ్డుకుంటున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద దాచడానికి ఏమీ లేదని, అన్ని అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు. స్పీకర్ అనుమతితో క్వశ్చన్ అవర్‌ను కూడా రద్దు చేసి చర్చను పొడిగించేందుకు సిద్ధమని చెప్పారు. నిబంధనల ప్రకారమే సభలో చర్చ జరగాలని, ఏదో ఒక ప్రకటన చేయాలంటూ ఇష్టానుసారంగా డిమాండ్ చేస్తే కుదరదని అమిత్ షా స్పష్టం చేశారు.
0 Comments