ఆగస్టు 24 నుంచి రెగ్యులేటరీ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం దేశంలో ఒక వ్యక్తి తన పేరుపై గరిష్టంగా ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉండాలనే దానిపై కఠినమైన రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి పేరుపై దేశవ్యాప్తంగా అన్ని టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ఏరియాలు కలుపుకుని గరిష్టంగా 9 కనెక్షన్లు మాత్రమే ఉండటానికి అనుమతి ఉంది. అంటే ఒక్కో కంపెనీలో 9 చొప్పున తీసుకోవడానికి కుదరదు. అన్ని నెట్‌వర్క్‌లు కలిపి మీ పేరు మీద ఉన్న మొత్తం సిమ్ కార్డుల సంఖ్య 9 లిమిట్ దాటకూడదు. ఉదాహరణకు మీ వద్ద జియో 4, ఎయిర్‌టెల్ 3, వీఐ 2 నంబర్లు ఉంటే.. మీ కోటా పూర్తిగా ముగిసినట్లే. దేశంలో చాలా ప్రాంతాల్లో గరిష్ట పరిమితి 9 సిమ్ కార్డులు కాగా, జమ్మూ -కశ్మీర్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కేవలం 6 కనెక్షన్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. టెలికాం ఆపరేటర్లు సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి.. కస్టమర్ ఫోటో, వివరాల ఆధారంగా ఇప్పటికే 9 కనెక్షన్లు ఉన్నాయా లేదా అని ఆన్‌లైన్‌లో తనిఖీ చేస్తారు. మీ కోటా పూర్తైతే కొత్త సిమ్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఒక వ్యక్తి పేరుపై ఇప్పటికే 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నట్లయితే.. కొత్త రూల్స్ ప్రకారం వాటిలో అదనంగా ఉన్న నంబర్లను టెలికాం సంస్థలు గుర్తించి సస్పెండ్ చేమెుచ్చు. కస్టమర్లు తమ పేరుపై గతంలో తీసుకొని ప్రస్తుతం వాడని నంబర్లు ఏవైనా ఉంటే.. సైబర్ మోసాలకు గురికాకుండా వాటిని వెంటనే సరెండర్ చేయడం, లేదంటే డిస్కనెక్ట్ చేయించడం మంచిది. మీ డాక్యుమెంట్లపై ఎన్ని మొబైల్ నంబర్లు రిజిస్టర్ అయి ఉన్నాయో తెలుసుకోవడానికి, మీకు తెలియకుండా ఎవరైనా సిమ్ తీసుకున్నారేమో చెక్ చేయడానికి ప్రభుత్వానికి చెందిన 'సంచార్ సాథి' యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. టెలికాం మోసాలు, ఫిషింగ్ కాల్స్, ఆర్థిక నేరాలను అరికట్టడమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం.
0 Comments