Ad Code

హైదరాబాద్ లో వేలానికి 10.63 ఎకరాల వాణిజ్య భూమి సిద్ధం : ఎకరా బేస్ ప్రైస్ రూ.175 కోట్లు

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం ఐటీ నాలెడ్జ్ సిటీలోని సర్వే నెం. 83/1 అత్యంత విలువైన 10.63 ఎకరాల వాణిజ్య భూమిని ఈ-వేలం వేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వేలంలో ఎకరా కనీస ప్రారంభ ధరగా ఏకంగా 175 కోట్లను నిర్ణయించారు. ఇది ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వేలముల్లో అత్యధిక రికార్డు కావడం గమనార్హం. మొత్తం 10.63 ఎకరాల భూమిని రెండు ప్రధాన ప్లాట్లుగా విభజించారు. ప్లాట్ P1 పరిధిలో 5.25 ఎకరాలు ఉండగా బేస్ విలువ సుమారు 918.75 కోట్లు , ప్లాట్ P2 పరిధిలో 5.38 ఎకరాలు బేస్ విలువ సుమారు 941.50 కోట్లుగా నిర్ణయించారు. ఆగస్టు 17, 21 తేదీల్లో నిర్వహించనున్న ఈ ఈ-వేలంలో పాల్గొనేందుకు ప్లాట్‌కు 10 కోట్ల చొప్పున బిడ్ ఈఎండీ కాగా, కనీస బిడ్ బిడ్డింగ్ పెరుగుదల ను ఎకరాకు ₹1 కోటిగా నిర్దేశించారు. ఆగస్టు 11న T-Hub వేదికగా ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుండగా, ఈ వేలం ద్వారా ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల నుంచి 2,500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆశిస్తోంది. ఈ స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడటానికి అనేక కీలక కారణాలు ఉన్నాయి. 100% వివాద రహిత క్లియర్ టైటిల్‌తో పాటు ఇవి అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ, మల్టీ-యూజ్ జోన్ పరిధిలోకి వస్తాయి. అంటే ఐటీ ఆఫీసు టవర్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, రిటైల్ లేదా ప్రిమియం హాస్పిటాలిటీ ప్రాజెక్టులను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. సింగిల్ విండో విధానం ద్వారా వేగవంతమైన అనుమతులతో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ కారిడార్‌లకు మధ్యలో ఉండటంతో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ-అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పోటీపడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో రాయదుర్గంలో జరిగిన TGIIC భూముల వేలంలో ఎకరం ధర రికార్డు స్థాయిలో రూ.237 కోట్లను తాకిన నేపథ్యంలో, ఈ తాజా ఈ-వేలంపై మార్కెట్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రీమియం కమర్షియల్ భూములకు ఉన్న తీవ్రమైన కొరత, హైదరాబాద్ ఐటీ రంగానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపు దృష్ట్యా ఆగస్టు 17, 21 తేదీలలో జరిగే వేలంలో బిడ్డింగ్ ధర మునుపటి రికార్డులను తిరగరాస్తుందని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu