కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ధర్మేంద్ర ప్రధాన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు తన ప్రొఫైల్‌లో ఉన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి అనే హోదాను తొలగించి దాని స్థానంలో సంబల్‌పూర్ ఎంపీ అని మార్చుకున్నారు. నీట్ పేపర్ లీకేజ్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలో ప్రారంభమైన నిరసనలు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. పెరుగుతున్న ఒత్తిడి మధ్య శనివారం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ప్రకటిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. గత పది రోజుల పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని.. ఇది వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని అన్నారు. దేశ ఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో పాటు, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలని, విద్యార్థులు తమ చదువులు, కెరీర్‌పై దృష్టి పెట్టేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ''ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గౌరవనీయ ప్రధానమంత్రికి నా రాజీనామా సమర్పించాను'' అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మే 3న జరిగిన పరీక్షలో అవకతవకలు బయటపడిన తర్వాత దర్యాప్తును సీబీఐకి అప్పగించామని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
0 Comments