Ad Code

హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదు

ప్రముఖ తమిళ నటుడు ఆర్య  సహా చిత్రబృందంపై సినిమా చిత్రీకరణ కోసం ఖరీదైన కెమెరాలు, లైటింగ్ పరికరాలు వాడుకుని, వాటికి సంబంధించిన రూ.1.80 కోట్ల బకాయిలు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం 'అనంతన్‌ కాడు' అనే తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో హీరో ఆర్య, నిర్మాత వినోద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని తాహేర్‌ సినీ టెక్నిక్‌ సంస్థను సంప్రదించారు. చిత్రీకరణ కోసం అత్యాధునిక డిజిటల్‌ కెమెరాలు, లైటింగ్‌ యూనిట్లు, ఇతర సాంకేతిక పరికరాలు అందించాలని కోరారు. అద్దె మొత్తాన్ని పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గతేడాది ఫిబ్రవరి 25న ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం సదరు సంస్థ తన సొంత ఖర్చులతో హైదరాబాద్‌ నుంచి కేరళకు ఖరీదైన పరికరాలను తరలించింది. చిత్రీకరణ పూర్తయ్యే వరకు పరికరాలను వాడుకున్న చిత్రబృందం.. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ.2.12 కోట్లలో కేవలం కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.1.80 కోట్లకు పైగా బకాయిలను నిలిపివేసింది. సినిమా విడుదలకు ముందే మొత్తం చెల్లించి 'నో డ్యూస్‌ సర్టిఫికెట్‌' తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకరించినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదు. బకాయిల కోసం లేఖలు, వాట్సప్‌ సందేశాలు పంపినా స్పందించకపోగా.. కేరళ కోర్టును ఆశ్రయించి వాస్తవాలను దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, బాకీ డబ్బుల కోసం సంప్రదించిన మేనేజర్‌ను హీరో ఆర్య, నిర్మాత వినోద్, పీఏ కిశోర్ కలిసి బెదిరించారని సంస్థ అకౌంటెంట్‌ జావేద్‌ అలీ శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నుంచి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu