ఉత్తరప్రదేశ్లోని మీరట్‌లో భర్త, ఆడపడుచు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ఒక మహిళ తెలుసుకున్నది. ఈ నేపథ్యంలో కత్తితో పొడిచి ఆమెను హత్య చేసింది. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితురాలిని అరెస్ట్ చేశారు. జూలై 12న నిదా అనే మహిళ ఆమె ఇంట్లో హత్యకు గురైంది. కత్తి పోట్ల వల్ల మరణించిన ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బయట వ్యక్తులు కాకుండా ఇంట్లోని వాళ్లే ఆమెను హత్య చేసినట్లు అనుమానించారు. తగిన ఆధారాలతో రింషా అనే మహిళను అరెస్ట్ చేశారు. కాగా, రింషా భర్త ఉవైస్, ఆడపడుచు నిదా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రింషాకు ఈ విషయం తెలియడంతో నిదా, ఆమె మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. జూలై 12న మధ్యాహ్న సమయంలో రింషా తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆ ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వంటగదిలోని కూరగాయలు కోసే కత్తితో నిదా ఛాతిపై రింషా పొడవటంతో ఆమె మరణించింది. అయితే అరెస్టైన నిందితురాలు రింషా తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు వివరించారు. ఈ సంఘటనలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
0 Comments