దేశంలో పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ అంశంలో మెటాకు సమన్లు జారీ చేయాల్సిందిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక శాఖ అధికారులను ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఆదేశించారు. పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ మెటాకు నోటీసులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అంశంపై బీబీసీ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్.. ఇండియాలో పిల్లలపై లైంగిక వేధింపుల్ని ప్రచారం చేసే సాధనంగా మారిందని బీబీసీ తన కథనంలో ఆరోపించింది. యాడ్స్ ప్రసారం చేయడమే కాకుండా, రేప్ వీడియో, చైల్డ్ వీడియో అంటూ ప్రచారం కూడా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ యాడ్స్‌కు సంబంధించిన వీడియోలు టెలిగ్రామ్‌లో ప్లే అవుతున్నాయి. ఇందుకు టెలిగ్రాం యూజర్లు తమ ఫాలోవర్లకు రూ.99లకు విక్రయిస్తున్నారు. పైగా ఈ యాడ్స్.. ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన మోడరేషన్ టెక్నాలజీ ఆమోదం పొందిన తర్వాతనే ప్రసారమవుతాయని తెలిపింది. అంటే, ఉద్దేశపూర్వకంగానే ఇన్‌స్టాగ్రామ్ వీటిని ప్రసారం చేస్తున్నట్లు బీబీసీ వివరించింది. దీనిపై గంటల వ్యవధిలోనే కేంద్రం స్పందించింది. మెటాకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై స్పందించిన మెటా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారమే తమ ప్రకటనలు ఉన్నట్లు తెలిపింది. వారం వ్యవధిలో మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. మెటాకు చెందిన వాట్సాప్‌లో యూజర్ ఐడీ ఫీచర్‌కు సంబంధించి గత బుధవారం కూడా కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మెటాతోపాటు టెలిగ్రామ్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై వాట్సాప్ స్పందించింది. యూజర్ల భద్రతకు, స్కాంలు, మోసాలకు వ్యతిరేకంగా కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
0 Comments