Ad Code

జింఖానా క్లబ్‌కు ఖాళీ చేయాలంటూ కేంద్రం షోకాజ్ నోటీసు జారీ

చారిత్రాత్మక 'ఢిల్లీ జింఖానా క్లబ్'ను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. సఫ్దర్‌జంగ్ రోడ్డులో దాదాపు 27.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విలువైన ప్రాంగణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ‘పబ్లిక్ ప్రెమిసెస్ (ఎవిక్షన్) యాక్ట్, 1971’ కింద క్లబ్ యాజమాన్యానికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదానికి సంబంధించి ఎస్టేట్ అధికారి తాజాగా స్పందిస్తూ.. ఈ ప్రభుత్వ స్థలాన్ని ఎందుకు ఖాళీ చేయించకూడదో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని క్లబ్ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఇందులో భాగంగానే జూలై 7వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. తమ వాదనలకు తగిన ఆధారాలు సమర్పించని పక్షంలో, చట్టప్రకారం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. లీజు ఒప్పందాన్ని రద్దు చేసినప్పటికీ క్లబ్ ఇంకా అదే స్థలంలో కొనసాగడం పూర్తిగా చట్టవిరుద్ధమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంతో పాటు పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలకు అతి సమీపంలో ఈ భూమి ఉంది. అందువల్ల, దేశ రక్షణ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా భద్రత, పరిపాలనాపరమైన మరియు ఇతర ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం ఈ స్థలాన్ని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటిష్ కాలంలో, అంటే 1928లో కుదిరిన లీజు ఒప్పందం ప్రకారం ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటయింది. అయితే, సదరు ఒప్పందంలోని ‘క్లాజ్ 4’ నిబంధన ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూమిని ఎప్పుడైనా తిరిగి స్వాధీనం చేసుకునే సర్వహక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. ఈ నిబంధన ఆధారంగానే కేంద్రం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి తోడు, క్లబ్ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వానికి సుమారు రూ.47 కోట్ల నుండి రూ.48 కోట్ల వరకు అద్దె బకాయిలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత మే నెలలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై క్లబ్ యాజమాన్యం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu