Ad Code

అయోధ్య రామాలయ విరాళాల అపహరణ కేసు : సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా వాష్‌రూమ్‌లలో డబ్బు దాచిన నిందితులు

యోధ్య రామాలయ విరాళాల అపహరణ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని ఇంటిదొంగలు అత్యంత సునాయాసంగా కోట్లాది రూపాయల సొమ్మును బయటకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు అనుమతితో ఈ కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్‌ శుక్లాను పోలీసులు రెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించగా, అతడు చోరీకి పాల్పడిన తీరును పూసగుచ్చినట్లు వివరించాడు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి? వాటిని కంట్రోల్ రూమ్ నుండి ఎవరు పరిశీలిస్తారు? అనే పూర్తి వివరాలు నిందితులకు ముందే తెలుసు. కెమెరాల నిఘా కంటికి చిక్కకుండా ఉండేందుకు లెక్కింపు గది నుండి దొంగిలించిన నోట్ల కట్టలను నిందితులు మొదట ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లలో దాచిపెట్టేవారని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఎవరూ లేని సమయం చూసుకుని అత్యంత సులభంగా ఆ సొమ్మును బయటకు తరలించేవారని అవినాష్ శుక్లా పోలీసుల ఎదుట అంగీకరించాడు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులతో తమకున్న సాన్నిహిత్యం కారణంగా తమను ఎవరూ కనీసం అనుమానించలేకపోయారని శుక్లా తెలిపాడు. విరాళాల కౌంటింగ్ రూమ్‌కు ఉండే రెండు తాళం చెవులలో ఒక తాళం చెవిని మరో నిందితుడు, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ అయిన టిన్నూ యాదవ్ సంపాదించాడు. బ్యాంక్ ఉద్యోగులు, ట్రస్ట్ ప్రతినిధులు లేని సమయం చూసి టిన్నూ యాదవ్ ఇచ్చిన తాళంతో గది తెరిచి నిందితులు క్రమబద్ధంగా ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఒకరు డబ్బు దొంగిలిస్తుంటే, మిగతా వారు చుట్టూ కవర్ చేస్తూ రక్షణగా నిలిచేవారని దర్యాప్తులో తేలింది. భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ముతో తాను ఇల్లు మరియు స్థలాలు కొనుగోలు చేసినట్లు అవినాష్ శుక్లా ఒప్పుకున్నాడు. దీనితో పోలీసులు నిందితుల ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లతో పాటు వారి ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ శుక్లా, టిన్నూ యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ సహా 8 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, నిందితులు విచారణలో పలుమార్లు ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించగా, ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది పెద్దల హస్తం ఉందనే కోణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu