అమెరికాలోని జార్జియాలో కుటుంబ వివాదం కారణంగా భారత సంతతికి చెందిన మహిళ, సీనియర్ గూగుల్ ఇంజనీర్ అయిన తన భార్యను హత్య చేసి, కుమారుడిని గాయపరిచిన 56 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, మంగళవారం రాత్రి కాబ్ కౌంటీలోని దంపతుల నివాసంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట బుల్లెట్ గాయాలతో ఉన్న వారి కుమారుడు జాసన్ వ్రెసియన్‌ను గుర్తించిన పోలీసులు, వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇంటి లోపల 57 ఏళ్ల శీతల్ వ్రెసియన్‌ను తుపాకీ గాయాలతో పోలీసులు కనుగొన్నారు. అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. దర్యాప్తు కోసం పోలీసులు ఈ ప్రాంతాన్ని కొన్ని గంటల పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనా స్థలంలోనే శీతల్ భర్త, నిందితుడైన కిర్క్ వ్రెసియన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదం కారణంగానే ఈ కాల్పులు జరిగినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక ఉన్న ఖచ్చితమైన కారణంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శీతల్, గూగుల్‌లో ఇంజనీరింగ్ విభాగంలో లీడర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గూగుల్‌లో చేరడానికి ముందు, ఆమె ప్రముఖ రిటైల్ సంస్థ 'హోమ్ డిపో' ఈ-కామర్స్ వ్యాపారంలో పనిచేశారు. శీతల్ అమెరికాకు వెళ్లడానికి ముందు ఇంగ్లాండ్, ఇండియా, ఘనాలో పెరిగారు. ఆమె 1994లో జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పొందారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కెరీర్ కొనసాగించే ఎంతోమంది మహిళలకు ఆమె ఒక మంచి మార్గదర్శకురాలిగా ఉండేవారని నివేదికలు పేర్కొన్నాయి.
0 Comments