వెనిజులాలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. మృత్యుగహ్వరంలా మారిన భవన శిథిలాల కింద కొన్ని రోజుల పాటు చిక్కుకుపోయిన 79 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. 'ఆపరేషన్ అమిస్తాద్'లో భాగంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోన్న భారత సైన్యం బుధవారం ఆ వృద్ధురాలిని సురక్షితంగా వెలికితీసి పునర్జన్మ ప్రసాదించింది. ఈ సంచలన రెస్క్యూకు సంబంధించిన వివరాలను ఆర్మీ అధికారికంగా 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. భూకంప తీవ్రతకు భవనం కూలిపోవడంతో సదరు వృద్ధురాలు శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఆ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. కొన్ని రోజులుగా తిండి, నీరు, కనీస వైద్యం అందకపోవడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రాణాల కోసం పోరాడుతున్న ఆమెను భారత సైన్యానికి చెందిన రెస్క్యూ బృందం అత్యంత చాకచక్యంగా గుర్తించి, బయటకు తీసుకువచ్చింది. శిథిలాల నుంచి రక్షించిన వెంటనే ఆమెను భారత సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక 'ఫీల్డ్ హాస్పిటల్'కు తరలించారు. అక్కడ ఇండియన్ ఆర్మీ వైద్య బృందం ఆమెకు అధునాతన అత్యవసర వైద్య సాయాన్ని అందిస్తోంది. ''ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రజలకు మానవతా సహాయం చేసేందుకు మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాం'' అని భారత సైన్యం ట్వీట్ చేసింది. భారతదేశం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న ఆ దేశానికి అండగా నిలిచేందుకు 'ఆపరేషన్ అమిస్తాద్' పేరిట ప్రత్యేక విమానాలలో అత్యాధునిక వైద్య సామాగ్రిని, మందులను, ప్రత్యేక రెస్క్యూ, మెడికల్ బృందాలను పంపి అంతర్జాతీయంగా తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది.
0 Comments