Ad Code

పుట్టినరోజు పార్టీ పేరుతొ యువతిపై అత్యాచారం : ఐదుగురు నిందితుల అరెస్ట్

బెంగళూరులో బర్త్‌డే వేడుకల పేరుతో ఒక యువతిపై నలుగురు స్నేహితుల సహకారంతో అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 30న ఈ ఘోరం జరిగింది. బెంగళూరు నైరుతి విభాగం డిసీపీ అనిత బి.హద్దన్నవర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల బాధితురాలికి సోమశేఖర్ అనే వ్యక్తితో చాలా కాలంగా పరిచయం ఉంది. ఇటీవల సదరు యువతి పుట్టినరోజు జరగ్గా, ఆ సమయంలో సోమశేఖర్ ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పలేదు. ఆ తర్వాత ఇద్దరం కలిసి బర్త్‌డే వేడుక చేసుకుందామని నమ్మించి, జూన్ 30న ఆమెను తలఘట్టపురకు ఆహ్వానించాడు. ఆమె హోటల్‌కు వెళ్దామని చెప్పినప్పటికీ, వినకుండా ముందు తన ఇంటికి వెళ్లి ఆ తర్వాత హోటల్‌కు వెళ్దామని బలవంతం చేశాడు. ఆ సమయంలోనే అతను తన నలుగురు స్నేహితులను కూడా అక్కడికి పిలిపించాడు. నిందితుడి ఇంటికి చేరుకున్నాక అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడైన అంబరీశ్ అనే వ్యక్తి ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోవడంతో, అంబరీశ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మిగిలిన నలుగురు నిందితులు ఆ సమయంలో హాల్‌లోనే కాపలాగా కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత యువతికి పాక్షికంగా స్పృహ రావడంతో ఎలాగోలా నిందితుల బారి నుంచి తప్పించుకుంది. వెంటనే పోలీసు అత్యవసర సహాయక నంబర్ ‘112’కు ఫోన్ చేసి తనకు జరిగిన దారుణాన్ని వివరించింది. సమాచారం అందుకున్న తలఘట్టపుర పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సోమశేఖర్, అంబరీశ్‌తో పాటు వారికి సహకరించిన ప్రదీప్, రామప్ప, జగదీశ్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu