భారత టెలికాం రంగ నియంత్రణ సంస్థ 2026 మే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్ నివేదికలో రిలయన్స్ జియో నెట్‌వర్క్ పనితీరు అత్యుత్తమంగా నమోదైంది. మాదాపూర్, అమీర్‌పేట్, మెహిదీపట్నం, శంషాబాద్ వంటి కీలక ప్రాంతాలతో సహా నగరంలోని 157.9 కిలోమీటర్ల మార్గాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో జియో డేటా, వాయిస్ సేవల్లో తన స్వీయ ప్రకటిత ప్రమాణాలను మించి రాణించింది. జియో తన 5G, 4G నెట్‌వర్క్‌లపై సగటున 222.12 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేసింది. ఇది కంపెనీ ప్రకటించిన సాధారణ డౌన్‌లోడ్ వేగం 15.00 Mbps కంటే 14 రెట్లు అధికం. అప్‌లోడ్ స్పీడ్ కూడా ఇదే తరహాలో ఉంది. సగటున 19.43 Mbps నమోదు కాగా, ఇది కంపెనీ ప్రకటించిన 7.00 Mbps కంటే చాలా ఎక్కువ. ఆటో సెలక్షన్ మోడ్‌లో సేకరించిన 22,063 నెట్‌వర్క్ నమూనాల్లో కేవలం 319 నమూనాల్లో మాత్రమే బలహీన సిగ్నల్ నమోదైంది. మార్గం మొత్తంలో "నో కవరేజ్" పరిస్థితి ఒక్కసారి కూడా నమోదు కాకపోవడం విశేషం. హైదరాబాద్‌లోని నివాస, వాణిజ్య, రవాణా కేంద్రాల్లో జియో నెట్‌వర్క్ స్థిరత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. వాయిస్ సేవల్లో కూడా జియో నాణ్యత అత్యుత్తమంగా నిలిచింది. విజయవంతంగా అనుసంధానమైన 202 కాల్స్‌లో ఒక్కటి కూడా డ్రాప్ కాలేదు. అలాగే, 191 కాల్స్‌లో మూడు సెకన్ల కంటే ఎక్కువసేపు నిశ్శబ్దం నమోదైన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఆపరేటర్లు స్వయంగా ప్రకటించే నెట్‌వర్క్ ప్రమాణాలను వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించి నిర్ధారించడమే ట్రాయ్ ఐటీడీ ప్రధాన లక్ష్యం. మాదాపూర్, అమీర్‌పేట్ వంటి రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రాల నుంచి శంషాబాద్ వంటి శివారు ప్రాంతాల వరకూ హైదరాబాద్‌లో జియో నెట్‌వర్క్ తన ప్రకటిత ప్రమాణాలను మించి పనిచేస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా డేటా వినియోగం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు జియో స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
0 Comments