Ad Code

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి !

ల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా నీటి లభ్యతకు అనుగుణమైన ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు భారత వాతావరణ శాఖ విడుదల చేస్తున్న వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వదంతులను నమ్మకుండా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే మార్గదర్శకాలనే అనుసరించాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై సచివాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా వారీ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సాగునీటి లభ్యతను నిరంతరం సమీక్షించి, వాటికి అనుగుణంగానే పంటల ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, గ్రామ సభలు, రైతు వేదికలు, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు విస్తృతంగా వివరించాలని సూచించారు. వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి శాస్త్రీయ సమాచారాన్ని వేగంగా రైతులకు చేరవేయాలని చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో శాస్త్రవేత్తల సిఫారసుల ఆధారంగా రైతులకు స్పష్టమైన సలహాలు అందించాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో ఉన్న వాస్తవ నీటి నిల్వలపై రైతులకు పారదర్శక సమాచారం అందించి, నీటి లభ్యతకు అనుగుణంగానే సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లి సహా గోదావరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను సమర్థవంతంగా నింపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్‌నీనో సవాళ్లను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. ఐటీ, పరిశ్రమల శాU మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సి రమేష్ బాబు, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌లు పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu