Ad Code

భవిష్యత్తులో మహిళలకు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం !

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో అన్నీ ఏసీ బస్సులే వస్తాయని, 'మహాశక్తి' ఉచిత ప్రయాణ పథకం కింద మహిళలు ఆ ఏసీ బస్సుల్లో కూడా ఉచితంగానే ప్రయాణించవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15,000 సాయాన్ని జమ చేసే తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. విజయవాడ కేంద్రంగా వైసీపీ అత్యంత హీనమైన కుల రాజకీయాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తిగత కక్షతో టార్గెట్ చేశారని మండిపడ్డారు. చివరికి ఆయన చిన్న పిల్లలైన కూతుళ్లను కూడా వదలకుండా సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వారి సంస్కారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే సోషల్ మీడియా సైకోలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై మాట్లాడుతూ, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమైన రాజధాని అందరికీ కావాలని, కానీ 'గొడ్డలి పార్టీ' అయిన వైసీపీకి మాత్రం దాని అవసరం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధానిని పూర్తిగా ధ్వంసం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణ పనులను మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu