తండ్రిని కూడా చంపింది ఆయుషినే : కుటుంబసభ్యులు ఆరోపణ

రాజస్థాన్‌ కు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం ఇటీవల తన తల్లిని హత్య చేసిన కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్‌ శర్మ ను చంపిందీ ఆమేనని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి ప్రణాళిక ప్రకారం వైద్యం అందకుండా చేసి, ఆయన చనిపోయేలా చేసిందని చెప్పారు. దాంతో తండ్రి ఉద్యోగం తనకు వస్తుందని భావించిందని, కానీ ఆ ఉద్యోగం తనకు కాకుండా 45 ఏళ్ల తల్లి నీరజ శర్మకు రావడంతో ఆమెపై పగతో రగిలపోయిందని, నిందితురాలి సోదరుడు తెలిపారు.ఈ క్రమంలో ఆమె తమ తల్లిని కూడా హత్య చేసిందని రాకేశ్‌ శర్మ ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టులో కోర్ట్ మాస్టర్‌గా పనిచేసిన తన తండ్రి విజయ్ 2024లో బ్రెయిన్‌ సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ కొన్ని రోజుల తర్వాత కోలుకున్నారని రాకేశ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆయనకు సరైన చికిత్స అందకుండా తన సోదరి ఆయుషినే అడ్డుకుందని ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పి తమ తండ్రిని తీసుకెళ్లిందని, దాదాపు మూడు నెలలపాటు ఆయన ఆచూకీని ఎవరికీ చెప్పలేదని ఆరోపించారు. అనంతరం ఆయనను జైపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపిందని రాకేశ్ చెప్పారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చామని, 2025 ఏప్రిల్‌లో ఆయన మరణించాడని తెలిపారు. విజయ్ శర్మ అంత్యక్రియలు పూర్తయిన వెంటనే కారుణ్య నియామకం కింద ఆయుషి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తానని చెప్పిందని, అదే సమయంలో తమ కుటుంబ ఆస్తులను తన పేరు మీద బదిలీ చేయాలని పట్టుబట్టిందని రాకేశ్‌ ఆరోపించారు. విజయ్ శర్మ మరణంపై విచారణ జరపాలని కోర్టును కోరారు. తన కంటే తన దివ్యాంగుడైన సోదరుడినే తల్లి ఎక్కువ ప్రేమగా చూసుకుంటోందని ఆయుషి తరచూ గొడవపడేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తన తల్లిని చంపే ప్లాన్‌ గురించి తన కజిన్‌ బలరామ్‌తో చర్చించినట్లు విచారణలో నిందితురాలు అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. తల్లిపై ఉన్న ద్వేషం, తండ్రి ఉద్యోగం తనకు రాలేదనే కోపంతోనే ఈ దారుణానికి పాల్పడిందన్నారు. ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్న నిందితురాలికి చట్టాలపై అవగాహన ఉందని, ఈ హత్య విషయంలో ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org