Ad Code

హైదరాబాద్‌లో డ్రగ్స్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురిని పట్టుకున్న పోలీసులు : మరో నలుగురు పరారు

హైదరాబాద్, పాతబస్తీలోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నేత కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పురానాపూల్ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలను కొనుగోలు చేయడానికి మొత్తం ఏడుగురు వ్యక్తులు రాగా, పోలీసుల రాకను గమనించి వారిలో నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారిలో మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ అనే ముగ్గురు నిందితులు పట్టుబడగా, వారి నుంచి 24 గ్రాముల హాష్ ఆయిల్ సాచెట్లు, అలాగే 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సోనీ, వంశీ, మనోజ్, తుల్జాసింగ్ అనే మరో నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన భరత్రాజ్ రెడ్డి, అభిషేక్, బొట్టు యూనిత్ లను వైద్య పరీక్షల అనంతరం పోలీసులు తదుపరి చర్యల కోసం రిహాబిటేషన్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై మంగళహాట్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu