ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో గత రెండు నెలలుగా ఉద్యోగం లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్న దినేష్ పటేల్ (48) అనే వ్యక్తి చిన్నపాటి గృహ వివాదంలో ఆగ్రహానికి లోనై తన భార్య సరితా పటేల్ (43)ను పెనంతో కొట్టి హత్య చేశాడు. శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా, ఆదివారం ఉదయం నిందితుడు నేరుగా బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా తాను గత 2-3 ఏళ్లుగా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మానసిక సమస్యకు చికిత్స పొందుతున్నట్లు నిందితుడు తెలిపాడు. గతంలో ఐటీ కంపెనీలో పనిచేసిన దినేష్, ఉద్యోగం పోవడంతో భార్యతో తరచూ గొడవ పడేవాడని తేలింది. 2005లో వివాహమైన ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హత్య జరిగిన సమయంలో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉండటంతో పోలీసులు వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
0 Comments