హర్మూజ్ జలసంధిలో సేవా రుసుమును వసూలు చేస్తామని ఇరాన్ ప్రకటించారు. చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రెహ్మానీ ఇదే అంశంపై స్పందిస్తూ, హర్మూజ్ తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున జలసంధిలో సేవా రుసుం వసూలు చేస్తామన్నారు.ఈ విషయంపై ఒమన్‌తో చర్చలు జరుపుతున్నామన్నారు. కష్టసమయంలో తమకు సహకారం అందించిన మిత్ర దేశాలకు సేవా రుసుం విషయంలో ప్రత్యేక ప్రాధాన్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హర్మూజ్‌లో ప్రయాణ భద్రతకు హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో నౌకల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడం వంటివాటిని ఒమన్ సహకారంతో ఇకపై తాము పర్యవేక్షిస్తామని అబ్దుల్ రెజా వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది స్పందిస్తూ, హర్మూజ్ భద్రతను ఇకపై ఒమన్‌తో కలసి తాము చూసుకుంటామన్నారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలు చేపట్టడానికి ఈ జలసంధి రంగస్థలం కాదని హెచ్చరించారు. అయితే, ఇరాన్ మిత్ర దేశాలకు సేవా పన్ను రుసుం వసూలులో మినహాయింపులు, రాయితీలు ఇచ్చే విషయంపై టెహ్రాన్ ఆలోచనలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్న విషయం తెల్సిందే.
0 Comments