తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, నేతల మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. గ్రూపు తగాదాలకు చెక్ పెట్టి, పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ముఖాముఖి చర్చలు జరుపుతూ నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం-పార్టీ మధ్య సమన్వయంపై మీనాక్షీ నటరాజన్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? సంస్థాగతంగా ఎలాంటి మార్పులు చేయాలి? అనే అంశాలపై కీలక నేతల నుంచి ఆమె అభిప్రాయాలు సేకరించారు. పార్టీ కేడర్‌లో జోష్ నింపేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. తమ పర్యటనలో భాగంగా మీనాక్షీ నటరాజన్ ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అందుబాటులో ఉండనున్నారు. అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో ఆమె విడివిడిగా 'వన్ టూ వన్' సమావేశాలు నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నేతల మధ్య ఉన్న వ్యత్యాసాలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర మంత్రులతో మీనాక్షీ నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం, అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మంత్రుల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ వరుస సమీక్షలతో తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తులకు బ్రేక్ పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
0 Comments