ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఊహించని విధంగా 9,000 మందికి పైగా కొత్త ఉద్యోగులను చేర్చుకుంది. టీసీఎస్ చూపిన ఈ భారీ సానుకూల ధోరణి తర్వాత ఇప్పుడు మార్కెట్ నిపుణులు, ఉద్యోగార్థుల దృష్టి ఇతర అగ్రశ్రేణి కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రోల నియామక ప్రణాళికలపై పడింది. ప్రస్తుత క్వార్టర్ లో టీసీఎస్ ఏకంగా 9,279 మంది నెట్ ఉద్యోగులను అదనంగా చేర్చుకుంది. ఇది గత నాలుగేళ్లలోనే అత్యుత్తమ త్రైమాసిక నియామక రికార్డు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా డొమైన్ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అనుభవజ్ఞులైన లాటరల్ హైరింగ్‌పై టీసీఎస్ దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సంస్థ యాక్సెంచర్ ఇటీవలి త్రైమాసికంలో దాదాపు 12,000 మందిని చేర్చుకున్న విధానాన్ని పోలి ఉండటంతో భారత ఐటీ రంగం రికవరీ బాట పట్టిందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా విశ్లేషించింది. ప్రస్తుతం టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069 కి చేరింది.
0 Comments