చైనా తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్‌జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు మూడు కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్‌జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు.
0 Comments