Ad Code

827 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు సరికొత్త ఉత్సాహంతో భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రంగాల షేర్లకు పెట్టుబడిదారుల నుండి భారీగా మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసిక (Q1) ఫలితాల సీజన్‌ ప్రారంభం కావడం మార్కెట్ వర్గాలలో సరికొత్త ఆశావహ దృక్పథాన్ని నింపింది. ముగింపు సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్‌ 827.57 పాయింట్లు పుంజుకుని 77,569.39 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ  సైతం 244.10 పాయింట్ల లాభంతో 24,206.90 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం మేర లాభపడగా, నిఫ్టీ రియాల్టీ ఏకంగా 3 శాతానికి పైగా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 3 శాతం వరకు లాభపడి మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. నిఫ్టీ50 ప్యాక్‌లో జియో ఫైనాన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైప్ వంటి దిగ్గజ షేర్లు మంచి కొనుగోళ్ల మద్దతుతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు, డాక్టర్‌ రెడ్డీస్‌, అపోలో హాస్పిటల్స్ (ఎటర్నల్), భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా వంటి ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. బ్యాంకింగ్ రంగం నుండి వచ్చిన సానుకూల త్రైమాసిక అప్‌డేట్లు, ఐటీ కంపెనీల ఆదాయాలపై ఉన్న సానుకూల అంచనాలు మార్కెట్ రాలీకి ప్రధాన కారణమయ్యాయి. అంతర్జాతీయంగా టెక్నాలజీ వ్యయాలు పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో వస్తున్న కొత్త అవకాశాలు ఐటీ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1 శాతం తగ్గి 75.41 డాలర్లకు, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ 71.16 డాలర్లకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం భారత మార్కెట్లకు భారీ కలిసివచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu