Ad Code

'ఉపా' చట్టం కింద 23 మంది మోస్ట్ వాంటెడ్స్ బ్లాక్‌లిస్ట్‌లో పట్టిన కేంద్ర హోం శాఖ

దేశ భద్రతకు అత్యంత ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదం వేళ్లను కత్తిరించేందుకు జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా మరియు వాటి అనుబంధ ఉగ్రసంస్థలకు చెందిన 23 మంది కీలక ఆపరేటివ్స్‌ను కేంద్రం 'ప్రకటిత ఉగ్రవాదులు'గా గుర్తిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ 23 మందిని ఉగ్రవాదుల జాబితాలోకి చేర్చినట్లు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు కుట్రలు పన్నడం, అంతర్జాతీయ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేయడం, లోయలోకి ఉగ్రవాదుల చొరబాట్లను పర్యవేక్షించడం మరియు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే టెర్రర్ రిక్రూట్‌మెంట్ వంటి దేశద్రోహ చర్యలలో వీరందరికీ నేరుగా ప్రమేయం ఉందని కేంద్రం పక్కా ఆధారాలతో వెల్లడించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం 'ఉపా' చట్టానికి చేసిన చారిత్రాత్మక సవరణల ప్రకారం.. కేవలం ఉగ్రవాద సంస్థలనే కాకుండా, ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములైన వ్యక్తులను కూడా నేరుగా 'ఉగ్రవాది'గా ప్రకటించే విశేష అధికారం కేంద్రానికి లభించింది. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా నోటిఫై చేసిన వెంటనే.. జాతీయ దర్యాప్తు సంస్థ  రంగంలోకి దిగి వారి అంతర్జాతీయ మరియు దేశీయ ఆర్థిక లావాదేవీలను నిలిపివేయడానికి, వారి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయడానికి పూర్తి చట్టపరమైన వెసులుబాటు కలుగుతుంది. గతంలో కేవలం ఉగ్రవాద ముఠాల గ్రూపులను మాత్రమే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే వీలుండగా, తాజా సవరణల తర్వాత వ్యక్తులను టార్గెట్ చేయడం ముమ్మరమైంది. శనివారం ప్రకటించిన ఈ 23 మందితో కలిపి.. భారతదేశంలో ఇప్పటివరకు కేంద్ర హోం శాఖ అధికారికంగా ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరుకుంది. సీమాంతర ముఠాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment

0 Comments

Close Menu