భారతదేశం 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుందని, అలాగే 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి ఈవెంట్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మోడీ చరిత్రాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను సందర్శించిన సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టీ20 లీగ్ 'బిగ్ బాష్ లీగ్' మ్యాచ్ భారత్‌లోని చెన్నైలో జరగనుండటంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఏ క్రీడా లీగ్‌కైనా భారతదేశంలో ఈవెంట్‌ను నిర్వహించడం వల్ల అంతర్జాతీయంగా విస్తృతమైన గుర్తింపు, ఆదరణ లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ యువ క్రికెటర్లను కలిసి ముచ్చటించారు. వారి జెర్సీలపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఆస్ట్రేలియా అధికారిక అంతర్జాతీయ క్రీడా చిహ్నమైన "రూబీ ది రూ"తో సరదాగా ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా పాల్గొని ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "MCGలోకి అడుగుపెట్టగానే ఏ భారతీయుడికైనా ఒకేసారి రెండు భావోద్వేగాలు కలుగుతాయి. ఒకటి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ఇచ్చే ఉత్సాహం అయితే, రెండోది మన రెండు దేశాల్లో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది ఒక ఉమ్మడి అభిరుచి అనే వాస్తవం" అని వ్యాఖ్యానించారు. స్టేడియం సందర్శనకు ముందు ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత అంగస్ టేలర్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, భవిష్యత్తు అవకాశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఆస్ట్రేలియావ్యాప్తంగా భారత భాగస్వామ్యానికి లభిస్తున్న విస్తృత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీపై అంగస్ టేలర్ స్పందిస్తూ, భారత్-ఆస్ట్రేలియా మధ్య గొప్ప స్నేహం మరియు అవకాశాలతో నిండిన భవిష్యత్తు ఉందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఇరుదేశాల మధ్య సముద్ర భద్రతా సహకార రోడ్‌మ్యాప్‌తో పాటు భద్రతా సహకార ఒప్పందాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా, భారత్‌కు యురేనియం ఎగుమతులను సులభతరం చేసే పౌర అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.
0 Comments