తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జోగిపేటలో పోతురాజు కృష్ణ అనే వ్యక్తి గౌరమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ ప్రేమ పెళ్లి వారిద్దరి జీవితంలో సంతోషం నింపలేదు. తరచూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతూ ఉండేవారు. కృష్ణ వాటర్ సప్లై పనిచేస్తూ ఉండగా, ఇంటి వ్యవహారాల విషయంలో ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. నిన్న అర్ధరాత్రి వంట విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఈరోజు ఉదయం కూడా గౌరమ్మ వంట చేయకపోవడంతో క్షణికావేశంలో ఉన్న కృష్ణ మంచంమీద ఉన్న 18 రోజుల పసికందును నేలపైకి బలంగా కొట్టాడు. ఈ దాడిలో శిశువు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గౌరమ్మ ఏడుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చి చూసి వెంటనే శిశువును జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అంబులెన్స్ లో వెళుతున్న క్రమంలోనే మార్గమధ్యలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. భర్త కృష్ణ దాడితో 18రోజుల శిశువు మృతి చెందడంతో కన్నీరు మున్నీరైన గౌరమ్మ పోలీసులకు భర్తపైన ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కృష్ణ ప్రతిరోజు తాగివస్తూ రోజు భార్యతో గొడవలు పడతాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.
0 Comments