కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, కేంద్రం కొనుగోలు లక్ష్యాలను తగ్గించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, కేంద్రం కేవలం 52 లక్షల టన్నుల (37 శాతం) కొనుగోలు లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిందని.. అదే పంజాబ్ (86%), ఛత్తీస్‌గఢ్ (67%), హర్యానా (65%) వంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజా ప్రభుత్వం ప్రతి గింజనూ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా రైతుల నుంచి 67.03 lakh మెట్రిక్ టన్నుల వరిని సేకరించి, రూ. 12,375 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న వరిని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేశామని, అలాగే మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు చెల్లించిందని తెలిపారు. కేంద్రం వెంటనే వరి కొనుగోలు పరిమితిని ఎత్తివేసి, రాష్ట్రంలో పండిన పంటలో కనీసం 70 శాతాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ రైతులకు కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం (152 మీటర్ల ఎత్తులో) విషయమై మహారాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాసినా స్పందన లేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున, తెలంగాణ బీజేపీ నేతలు ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చర్చలు జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments