Ad Code

మెట్రో ప్రాజెక్టును ఆపాలని తానేందుకు చెబుతాను : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ, ఐఆర్ఎఫ్‌సీ రూ. 13,600 కోట్ల లోన్ల బదిలీ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మెట్రో ప్రాజెక్టును ఆపాలని తానేందుకు చెబుతానని, తాను వద్దంటే ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగుతాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఎలాంటి అవగాహన లేకుండా, అనాలోచితంగా మాట్లాడుతున్నారని, ప్రతిదానికీ తనపై తప్పుడు ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మార్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తానెప్పుడూ ముందుంటానని, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక్క రహదారుల రంగానికే తెలంగాణలో దాదాపు రూ. 1.75 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి తమ బాధ్యతని, దీనికోసం కాంగ్రెస్ నేతలు తనకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. తాము చేస్తున్న పనులకు సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదని.. తాను ముఖ్యమంత్రికి కాదు, కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను చేసిన పోరాటాలను కిషన్ రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్రం కోసం ఢిల్లీ వేదికగా రెండుసార్లు తానే స్వయంగా వచ్చి ధర్నాలు చేశానని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాకే ఆమరణ దీక్షను విరమించానని గుర్తుచేశారు. రైల్వే స్టేషన్ల నవీకరణ, అభివృద్ధి కోసం నాడు కేసీఆర్‌కు, నేడు సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా చొరవ తీసుకుని లేఖలు రాశానని తెలిపారు. రేవంత్ రెడ్డి అడిగితేనే తాను రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడం లేదని, ఒక కేంద్ర మంత్రిగా తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం చురుగ్గా పనిచేయాలని, నిధుల సాధనపై దృష్టి పెట్టాలని గతంలోనే తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని కిషన్ రెడ్డి మీడియా ముందు బయటపెట్టారు. రేవంత్ అనుకుంటేనో.. లేదా నేను అడ్డుకుంటేనో కేంద్ర ప్రాజెక్టులు ఆగిపోవు. రాజకీయ కక్షలతో ప్రాజెక్టులను అడ్డుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కావచ్చు.. కానీ భారతీయ జనతా పార్టీకి ఆ అలవాటు లేదు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu