తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది లేదని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. తన రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ కావడంపై భారతీయ జనతా పార్టీ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి ఆమె నామినేషన్ వేయగా, పరిశీలించిన ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. ఒక పాత కేసు అంశాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదనే కారణంతో ఎన్నికల సంఘం ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం రాజకీయ వివాదంగా మారింది. బీజేపీ, ఈసీ పరస్పరం లాలూచీపడి కుట్రపూరితంగా తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించాయని మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కేసుల సమాచారాన్ని కాంగ్రెస్ నేతలే లీక్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. బీజేపీ ఓటు చోరీలే కాదు రాజ్యసభ సీట్లు కూడా చోరీ చేస్తుందని, అందుకు తనకు ఎదురైన అనుభవమే నిదర్శనం అన్నారు. మధ్యప్రదేశ్ నుంచి తన రాజ్యసభ సీటు చోరీకి గురైందని, బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాను ప్రస్తుతం పోరాడుతున్నానని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. అంతేకానీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లాలని తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. తన కోసం మరెవరితోనైనా రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి రాజ్యసభ సీటు తీసుకునే ఆలోచన తనకు లేదన్నారు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం కేసు ఉన్నంత మాత్రాన నామినేషన్ రిజెక్ట్ చేయరని, నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేతలను నామినేషన్ రూమ్‌లోకి ఎలా అనుమతించారని ఆమె ఈసీని ప్రశ్నించారు.
0 Comments