ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో సస్పెండైన విజయవాడ, కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) నాగరాజుపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుడైన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెండైన సీఐ నాగరాజుపై 127 (4), 127(6), 103(1), 238 బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసు విచారణాధికారిగా రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ ను ప్రభుత్వం నియమించింది.