Ad Code

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు : గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ : కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి విజన్ సాధనలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు సాంస్కృతిక, సామాజిక వనరుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది పరిసర ప్రాంతాలు పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, సాంస్కృతిక వేదికలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పర్యాటక రంగానికి కూడా ఇది కొత్త ఊపునిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆధునిక సదుపాయాలు, పచ్చదనం, ప్రజా వినియోగానికి అనువైన మౌలిక వసతులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Post a Comment

0 Comments

Close Menu