హైదరాబాద్‌లో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ఏసీబీ ప్రత్యేక బృందాలు మంగళవారం ఉదయం ఏకకాలంలో దాడులు ప్రారంభించాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పరిధిలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు చేస్తున్న అధికారులకు తవ్వకొద్దీ అక్రమ ఆస్తుల నిధులు బయటపడుతుండటంతో అధికారులు అవాక్కయ్యారు. ఛత్రినాకలోని నరహరి ప్రధాన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఏసీబీ ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. నరహరి ఇంట్లో సోదాల సందర్భంగా గదులు, లాకర్లలో దాచి ఉంచిన భారీగా నగదు కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఆయన పడుకునే మంచం మొత్తం నోట్ల కట్టలు పరిచారు. ఆ పైన పరుపు వేసి దాని మీద పడుకుంటున్నారు. నోట్ల కట్టల విలువ కోట్లలో ఉండే అవకాశం ఉండటంతో లెక్కింపు కోసం ప్రత్యేక మిషన్లను రంగంలోకి దించారు. నగదు, బంగారమే కాకుండా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అత్యంత ఖరీదైన ల్యాండ్, ప్లాట్లకు సంబంధించిన కీలక భూ పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వే డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తూ భారీగా భూములు వెనకేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్న పలు రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ అక్రమ మార్గాల్లో వందల కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన ఏసీబీ, నరహరి బినామీల నెట్‌వర్క్‌పై కూడా దృష్టి సారించింది.
0 Comments