ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ అనేది ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. ఇప్పటివరకు కంప్యూటర్లకు సమాచారం అందించే పని ప్రధానంగా డిజిటల్ డేటాపైనే ఆధారపడి ఉండేది. అయితే ఇప్పుడు మనుషులు చేసే రోజువారీ పనులను నేర్చుకునే హ్యూమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేయడానికి కొత్త తరహా డేటా అవసరమవుతోంది. అందుకే భారతదేశంలో గృహిణులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తమ తలలకు కెమెరాలు లేదా స్మార్ట్‌ఫోన్లు అమర్చుకుని రోజువారీ పనులను చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలే భవిష్యత్తులో మనుషుల్లా పనిచేసే రోబోలకు పాఠాలుగా మారనున్నాయి. చెన్నైకి చెందిన 25 ఏళ్ల నాగిరెడ్డి శ్రీ రామచంద్ర ప్రతిరోజూ ఇంటి పనులు చేస్తూ వాటిని వీడియోగా రికార్డ్ చేస్తోంది. పండ్లు కోయడం, వంటగదిలో పనులు చేయడం వంటి సాధారణ కార్యకలాపాలను తలకు అమర్చుకున్న స్మార్ట్‌ఫోన్‌తో చిత్రీకరించి ఏఐ డేటా కంపెనీలకు పంపుతోంది. ఇందుకు గంటకు రూ.250 వరకు పారితోషికం అందుతోంది. ఈ ఫస్ట్-పర్సన్ వీడియోలను “ఎగోసెంట్రిక్ డేటా”గా పిలుస్తారు. మనిషి కళ్లతో ప్రపంచాన్ని చూసినట్లుగా ఉండే ఈ డేటా ద్వారా రోబోలు వస్తువులను ఎలా పట్టుకోవాలి, ఎలా కదలాలి, ఎలా పని చేయాలనే విషయాలను నేర్చుకుంటాయి. ప్రస్తుతం ఏఐ డేటా సేకరణ, ప్రాసెసింగ్, లేబెలింగ్ రంగాల్లో భారత్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. వేలాది మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా హ్యూమనాయిడ్ రోబోలు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇటువంటి డేటా సేకరణ సేవలకు డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఏఐ అభివృద్ధికి అవసరమైన మానవ ప్రవర్తన నమూనాలను అందించడంలో భారతీయుల పాత్ర కీలకంగా మారుతోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం ఉపాధిపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరుకు చెందిన 55 ఏళ్ల పూలదండలు తయారు చేసే పొన్ని కూడా కెమెరా ధరించి తన పనిని రికార్డ్ చేసింది. అయితే భవిష్యత్తులో రోబోలు ఇలాంటి పనులు చేపడితే ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
0 Comments